రేసులో ఉన్నట్టు నిరూపించుకున్న సంజీవ్ రెడ్డి.. -ఫిరోజ్ ఖాన్, సీనియర్ ఫ్రీలాన్స్ జర్నలిస్ట్, 9640466464

నామినేషన్ వేసిన తీరుతో స్పష్టం చేసిన నేత
‘ఓసీ-బీసీ-మైనార్టీ’ కాంబినేషన్
దళిత, గిరిజన నేతల మద్దతు సైతం
రెడ్డీ కమ్యూనిటీలో ఓ వర్గం సపోర్ట్
ఆయన వెంటే ‘కట్టర్ కాంగ్రెస్’
గెలిస్తే ‘హస్తం’ గూటికే?


మారుతున్న రాజకీయ పరిణామాలు
నామినేషన్ల పర్వం ముగిసిన వెంటనే.. ఆదిలాబాద్ నియోజకవర్గ రాజకీయం ఒక్కసారిగా మారింది. ఇప్పటి వరకు సెగ్మెంట్ లో త్రిముఖ పోటీ నెలకొందనే చర్చ ఉండగా.. కాంగ్రెస్ రెబల్, ఇండిపెండెంట్ అభ్యర్థి సంజీవ్ రెడ్డి నామినేషన్ వేసిన తీరు చూస్తుంటే.. చతుర్ముఖ పోటీ తప్పదన్నట్లు పరిస్థితి మారింది. సంజీవ్ రెడ్డి వెంట ఇటీవల పార్టీకి రిజైన్ చేస్తున్నట్లు ప్రకటించిన మాజీ డీసీసీ ప్రెసిడెంట్ సాజిద్ ఖాన్, మాజీ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గండ్రత్ సుజాత కనిపించడం ‘ఇండిపెండెంట్’కు మరింత బలాన్నిచ్చింది. ‘ఓసీ-బీసీ-మైనార్టీ’ కాంబినేషన్ తోపాటు ఆయనకు రెడ్డి కమ్యూనిటీలోని ఒక వర్గం మద్దతు ఉన్నట్లు తెలుస్తున్నది. మరోవైపు దళిత, గిరిజన నేతలు సైతం సపోర్ట్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది. ఆయన గెలిస్తే హస్తం గూటికే చేరుతారనే చర్చ నడుస్తుండగా.. ‘కట్టర్ కాంగ్రెస్’ నేతలు ఆయన ర్యాలీలో కనిపించడం దీనికి బలాన్ని చేకూరుస్తున్నది.  మాజీ మంత్రి దివంగత రామచంద్రారెడ్డికి ఉన్న మంచిపేరు సంజీవ్ రెడ్డిని విజయతీరాలను చేరుస్తుందని ‘ట్రిపుల్ - ఎస్’ త్రయం భావిస్తున్నది.

ముగ్గురిలో ఎక్కువ నష్టమెవరికి?
ఇప్పటి వరకు బీఆర్ఎస్ తరపున పోటీ చేస్తున్న ఎమ్మెల్యే, మాజీ మంత్రి జోగురామన్న, బీజేపీ నుంచి బరిలో ఉన్న పాయల శంకర్, కాంగ్రెస్ తరపున టికెట్ సంపాదించిన ఎన్ఆర్ఐ కంది శ్రీనివాస్ రెడ్డి మధ్యే ప్రధాన పోటీ ఉన్నట్లు కనిపించింది. అయితే కాంగ్రెస్ రెబల్ గా నామినేషన్ వేస్తామని గతంలోనే ప్రకటించిన సంజీవ్ రెడ్డి.. అంతగా ప్రభావం చూపే అవకాశాలు లేవేమోనని అందరూ భావించారు. అయితే ఆయన సుమారు పదివేల మందితో భారీ ర్యాలీ నిర్వహించి నామినేషన్ దాఖలు చేయడాన్ని చూస్తుంటే.. పోటీపై సీరియస్ గా ఉన్నట్లు కనిపిస్తున్నారు. మరోవైపు సంజీవ్ రెడ్డి బరిలో ఉండడంతో ఈ ముగ్గురిలో ఎక్కువగా నష్టపోయేదెవరనే చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో మొదలైంది. సంజీవ్ రెడ్డికి రెడ్డి కమ్యూనిటీలోని ఓ వర్గం ఇంటర్నల్ గా సపోర్ట్ చేస్తుందనే ప్రచారం జరుగుతుండగా, ఇది కాంగ్రెస్ అభ్యర్థి కంది శ్రీనివాస్ రెడ్డి ఓటు బ్యాంకుపై ప్రభావం చూపనున్నట్లు తెలుస్తున్నది. అంతేకాకుండా దశాబ్దాలుగా ‘హస్తం’ పార్టీలో ఉన్న కట్టర్ కాంగ్రెస్ కార్యకర్తలు సైతం సంజీవ్ రెడ్డికి ఓపెన్ గా సపోర్ట్ చేస్తున్నారు. ఇది కాంగ్రెస్ ఓటు బ్యాంకును దెబ్బతీసే ప్రమాదమున్నది. అంతేకాకుండా మాజీ మంత్రి సీ రాంచంద్రారెడ్డి పేరుతో కాంగ్రెస్ కు ప్రతిసారి పడే ఓట్లు ఈ సారి సంజీవ రెడ్డివైపు డైవర్ట్ అయ్యే అవకాశాలున్నాయి. సాజిద్ ఖాన్.. మైనార్టీ ఓట్లను లాగే అవకాశాలున్నందున ఆ ప్రభావం కాంగ్రెస్ తోపాటు బీఆర్ఎస్ ఓటు బ్యాంకుపై పడే సూచనలు కనిపిస్తున్నాయి. గండ్రత్ సుజాత మున్నూరుకాపుతోపాటు కొంత బీసీ ఓటు బ్యాంకును సంజీవ్ రెడ్డి వైపు డైవర్ట్ చేయడంలో సక్సెస్ అయితే జోగురామన్న ఎక్కువగా నష్టపోయే అవకాశమున్నది. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఓటు బ్యాంకును సంజీవ్ రెడ్డి లాగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తుండగా, ఈ రాజకీయ పరిణామాలతో పాయల్ శంకర్ బీజేపీ లాభపడే చాన్సెస్ సైతం ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


ఇండిపెండెంట్లను ఆదరించిన చరిత్ర..
ఆదిలాబాద్ సెగ్మెంట్ చరిత్రను పరిశీలిస్తే.. నియోజకవర్గ ప్రజలు స్వతంత్ర అభ్యర్థులను ఆదరించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. నియోజకవర్గంలో ఇప్పటి వరకు నాలుగుసార్లు ఇండిపెండెంట్లు విజయం సాధించారు. 1962లో విఠల్ రావు దేశ్ పాండే, 1978, 1985లో సీ రామచంద్రారెడ్డి, 1983లో చిలుకూరి వామన్ రెడ్డి స్వతంత్ర అభ్యర్థులుగా విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టారు. అంతేకాకుండా 1972, 1994, 1999 ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన అభ్యర్థులు కూడా ఇండిపెండెంట్లే కావడం గమనార్హం. నియోజకవర్గ ప్రజలు ఇండిపెండెంట్లకు సైతం సపోర్ట్ చేసే అవకాశాలున్న నేపథ్యంలో సంజీవ్ రెడ్డి ప్రభావం చూపగలిగే అవకాశాలుసైతం ఉన్నాయని నియోజకవర్గంలో చర్చ జరుగుతున్నది. మరోవైపు ఆయన ఇండిపెండెంట్ గా గెలిస్తే మళ్లీ కాంగ్రెస్ లోకే చేరుతారని ప్రచారం జరుగుతుండడంతో కాంగ్రెస్ కార్యకర్తలు సైతం ఆయనకే ఓటు వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Comments